మియాపూర్‌లో క్రుంగిన రోడ్డు...10-12 అడుగుల గొయ్యి

June 05, 2020


img

ఈరోజు ఉదయం మియాపూర్‌-ప్రశాంత్ నగర్ ప్రధాన రహదారి హటాత్తుగా క్రుంగిపోయింది. ఆ ప్రదేశంలో ఏకంగా సుమారు 6 అడుగులు వెడల్పు, 8 అడగుల పొడవు, 10-12 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరుగలేదు. సమాచారం అందుకొన్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని ఆ రోడ్డును మూసివేసి గొయ్యి చుట్టూ ప్రమాదపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. దానికి సమీపంలోనే మరోచోట కూడా రోడ్డు క్రుంగినట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడ కూడా ప్రమాదపు హెచ్చరికలను పెట్టారు. 

ఆ రోడ్డు కిందుగా ఓ భారీ త్రాగునీటి గొట్టం ఉంది. గతంలో దానిని వేసేటప్పుడు తవ్విన గోతిని రాళ్ళు, మట్టి వేసి బలంగా పూడ్చి ఉంటే ఈవిధంగా జరిగేది కాదు. కానీ వదులుగా ఉన్న ఆ మట్టిపైనే రోడ్డు నిర్మించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కింద ఉన్న మట్టి కరిగిపోయి భూమి కుంగి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. 

ఆ గోతిని బలంగా పూడ్చిపెట్టి, దానికి సమీపంలోనే కుంగినచోట తవ్వించి అక్కడ కూడా మట్టి, రాళ్ళతో పూడ్చిపెట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది పనులుమొదలుపెట్టబోతున్నారు. 

లాక్‌డౌన్‌ కారణంగా ఆ రోడ్డుపై ప్రజల రాకపోకలు బాగా తగ్గిపోయాయి లేకుంటే నిత్యం వేలాదివాహనాలు ఆ రోడ్డుపై తిరుగుతుండేవి. ఆ గొయ్యి ఏర్పడిన చోటుకు సమీపంలోనే ఓ ప్రైవేట్ స్కూలు కూడా ఉంది. అది కూడా మూసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.


Related Post