కేసీఆర్‌, మంత్రులు నిబందనలకు అతీతులా? ఉత్తమ్ ప్రశ్న

June 05, 2019


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితర కాంగ్రెస్‌ నేతలు కొంతమంది సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టును సందర్శించేందుకు గురువారం వెళుతుండగా వారిని పటాన్‌చెరు వద్ద పోలీసులు అదుపులో తీసుకొని బీడీఎల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించినందుకు పోలీసులు వారిపై కేసులు నమోదు చేసిన తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 

తమను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడంపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఒక ఎంపీ, పిసిసి అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేను, మా పార్టీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డుపైకి వస్తేనే అరెస్ట్ చేసి కేసులు పెడతారా?మేము అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఓ పదిమంది ప్రాజెక్టును పరిశీలించడానికి వెళుతుంటే అడ్డుకొని కేసులు పెడుతున్న పోలీసులు, వేలాదిమందిని వెంటేసుకొని సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ మంత్రులను ఎందుకు అడ్డుకోవడం లేదు? వారు లాక్‌డౌన్‌ నిబందనలకు, చట్టాలకు అతీతులా? 

రాష్ట్రంలో ప్రతిపక్షనేతలు ఇళ్ళలో నుంచి కాలు బయటపెడితే చాలు..అరెస్టులు చేస్తూ చాలా అక్రమంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలా తయారయ్యారు. అసలు పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకొంటున్నారు? ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిజిపిని ప్రశ్నిస్తున్నాను. 

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూరు, మంజీరాలను నింపి ప్రజలకు త్రాగునీటిని అందిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ సిద్ధిపేట, గజ్వేల్, సిఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌కు మాత్రమే నీళ్ళు అందుతున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాలలో  ప్రజలు త్రాగునీరు లేక నానాకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే మేము ప్రభుత్వానికి దాని బాధ్యతను, హామీలను గుర్తు చేసేందుకు బయలుదేరితే అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. అయితే అరెస్టులు, కేసులతో ప్రతిపక్షాల గొంతులు నొక్కేయవచ్చనుకొంటే అవివేకమేనని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది,” అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. 


Related Post