జూన్ తరువాతే సినిమా థియేటర్లు?

June 04, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సినిమా ధియేటర్లు మూతపడ్డాయి. సినిమా షూటింగులు కూడా నిలిచిపోయాయి. రెండున్నర నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ధియేటర్లు తెరుచుకోకపోవడంతో ధియేటర్ల యజమానులతో పాటు వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది సిబ్బంది కూడా విలవిలలాడుతున్నారు. సినిమా ధియేటర్లు తెరుచుకోకపోవడంతో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న సినిమాలను విడుదల చేయలేకపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలను తీసే భారతీయ సినీపరిశ్రమ లాక్‌డౌన్‌ దెబ్బకు తీవ్రంగా నష్టపోతుండగా, దానిపై ఆధారపడిన లక్షలాది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, సినీ పరిశ్రమకు అవసరమైనవాటిని సరఫరా చేసే అనేక సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. 

ఈ సమస్యలు చాలవన్నట్లు ఓటిటి రూపంలో సినిమా ధియేటర్లకు మరో కొత్త సమస్య, సవాళ్ళు ఎదురవుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా ధియేటర్లు మూతపడటంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌వర్క్‌ ఫ్లిక్స్, జీ5 వంటి ఓటిటి ప్లాట్‌ఫారంల ద్వారా ప్రజలు ఇళ్ళలోనే కూర్చొని కొత్త సినిమాలను చూసే వెసులుబాటు కలిగింది. దాంతో కొంతమంది నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలను నేరుగా ఓటిటి ప్లాట్‌ఫారంల ద్వారానే విడుదల చేసేస్తున్నారు. సినీరంగానికి చెందిన అల్లు అరవింద్, రామగోపాల్ వర్మ వంటివారు సొంతంగానే ‘ఆహా’, ‘ఆర్‌జీవీ వరల్డ్’ వంటి ఓటిటి ప్లాట్‌ఫారంలను ప్రారంభించేశారు. 

ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్లలో పని చేస్తున్న వేలాదిమంది రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఓటిటిలతో సినిమా థియేటర్లు శాస్వితంగా మూతపడితే వారి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. కనుక సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తదితరుల తరపున కొందరు ఇటీవల కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకొని తక్షణం సినిమా థియేటర్లు  తెరిచేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. 

కానీ లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతుండటంతో ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతించలేమని, జూలై నెలలో పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకొంటామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ వారికి చెప్పారు. 

సినిమా ధియేటర్లలో కొన్ని సీట్లు తగ్గించుకొని భౌతికదూరం పాటించవచ్చు కానీ ఏసీ ఉన్న కారణంగా థియేటర్ల తలుపులు మూసి అంతమంది ప్రేక్షకులను రెండు గంటలసేపు లోపల ఉంచినట్లయితే వారిలో ఒక్క కరోనా రోగి ఉన్నా చాలా సులువుగా థియేటర్లో ఉన్నవారందరికీ కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ సమస్యకు సినిమా థియేటర్ల యజమానులే పరిష్కారం కనుగొనగలిగితే థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి లభించవచ్చు. లేకుంటే కరోనా మహమ్మారి దేశంలో సినిమా థియేటర్లను కూడా మింగేయడం ఖాయం. 


Related Post