జగ్గారెడ్డికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మందలింపు?

June 04, 2020


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మందలించినట్లు తెలుస్తోంది. ఇటీవల జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలి. ఒకవేళ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించదలిస్తే నాకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పదవిని రేవంత్‌ రెడ్డికి కట్టబెడితే చూస్తూ ఊరుకోను. నా స్థాయిలో నేను చక్రం తిప్పి అడ్డుకొనే ప్రయత్నం చేస్తాను,” అని అన్నారు.

దీంతో పిసిసి అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటలు బయటపడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా పిసిసి అధ్యక్షుడుగా కొనసాగాలని కోరుకొంటున్నారని అందుకే జగ్గారెడ్డి ద్వారా ఆవిధంగా చెప్పిస్తున్నారనే వాదనలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం పిసిసి అధ్యక్షుడిని మార్చే ఆలోచన ఏమీ చేయనప్పుడు జగ్గారెడ్డి అనవసరంగా పదేపదే ఆ విషయం ప్రస్తావిస్తూ పార్టీ పరువు ఎందుకు    బజారుకీడుస్తున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పార్టీలో మొదలైన ఈ వాదోపవాదలతో పార్టీకి ఇంకా నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని భావించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం జగ్గారెడ్డిని ఈ అంశంపై మళ్ళీ మీడియా ముందు మాట్లాడవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది.


Related Post