జూన్ 8 నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు?

June 04, 2020


img

సిఎం కేసీఆర్‌ అనుమతిస్తే ఈ నెల 8 నుంచి హైదరాబాద్‌లో సిటీబస్ సర్వీసులను ప్రారంభించాలని టీఎస్‌ ఆర్టీసీ భావిస్తోంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుదవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు పురుషోత్తం, టీవీ రావు, యాదగిరి, వినోద్‌, వెంకటేశం తదితరులతో సమావేశమయ్యారు. 

కరోనా నేపద్యంలో ఇదివరకులా సిటీ బస్సులలో కిక్కిరిసిపోయేంతగా ప్రయాణికులను ఎక్కించుకోవడం సాధ్యం కాదు. పైగా ఉన్న కొద్దిపాటి సీట్లలో కూడా ప్రయాణికుల మద్య భౌతికదూరం పాటించవలసి ఉంటుంది. లేకుంటే సిటీ బస్సులు కరోనా వాహకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. కానీ నగరంలో వేలాదిమందిని వారి గమ్యస్థానాలకు చేర్చాలంటే ఈవిధానంలో సాధ్యం కాదు. కనుక ఆర్టీసీ నష్టపోకుండా... ప్రయాణికులకు కరోనా వ్యాపించకుండా సిటీబస్సులు నడపడం ఆర్టీసీకి కత్తిమీద సామూవంటిదేనని చెప్పవచ్చు. 

ఇప్పటికే 78 రోజులుగా సిటీబస్సులు డిపోలకే పరిమితమవడం వలన ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోయింది. దీంతో సిటీ బస్సులలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, డిపోలలో పనిచేసే మెకానిక్కులు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో వారందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనుక తక్షణం సిటీ బస్సులను నడిపించాలని వారు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. ఈ సమస్యలన్నిటిపై మంత్రి అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. నేడోరేపో సిఎం కేసీఆర్‌ను కలిసి ఈ సమస్యలపై చర్చించనున్నారు. సిఎం కేసీఆర్‌ అనుమతిస్తే ఈ నెల 8 నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటోంది.


Related Post