తెలంగాణలో 94 కొత్త కేసులు.. మొత్తం 2,792

June 02, 2020


img

తెలంగాణలో గడిచిన 24 గంటలలో కొత్తగా 94 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలియజేసింది. వాటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో చెరో 3 కేసులు, మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలలో చెరో 2 కేసులు, మహబూబాబాద్, పెద్దపల్లి, జనగావ్ జిల్లాలలో ఒక్కో కేసు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య 2,792కి చేరింది. వారిలో 1,491 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 1,213 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 88 మంది కరోనాతో మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. విదేశాల నుంచి తిరిగివచ్చినవారు, వలస కార్మికులలో నిన్న కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

నిన్నటి వరకు రాష్ట్రంలో 14 జిల్లాలు కరోనా రహితంగా ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 9కి పడిపోయింది. రాష్ట్రంలో సిరిసిల్లా, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, గద్వాల్ జిల్లాలో మాత్రమే కరోనారహిత జిల్లాలుగా నిలిచాయి. 

అయితే రాష్ట్రంలో జిల్లాల మద్య, అలాగే ఇరురుగు పొరుగు రాష్ట్రాల మద్య ప్రజల రాకపోకలు మొదలయ్యాయి కనుక మళ్ళీ అన్ని జిల్లాలకు కరోనా వైరస్‌ వ్యాపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు, పారిశుద్య కార్మికులు గత రెండు నెలలుగా కరోనాతో ప్రత్యక్ష పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇకపై కూడా చేస్తూనే ఉంటారు. కానీ ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తేనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. లేకుంటే కుటుంబంలో ఆత్మీయులను కోల్పోవలసి వస్తుందని మరిచిపోకూడదు.


Related Post