తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

June 02, 2020


img

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి నేటికీ సరిగ్గా 6 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకోనున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు తెలంగాణ...ప్రజలు నిత్యం అనేక సమస్యలకు ఎదురీదవలసి వచ్చేది. కనీసావసరాలైన త్రాగుసాగు నీరు, విద్యుత్ వంటివి కూడా ఉండేవి కావు. కానీ ఈ ఆరేళ్ళ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడటమేకాక ఆయా రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదగగలిగింది. ప్రతిపక్షాలు అవునన్నా కాదన్నా ఇది నిజం. గతంలో అభివృద్ధి అంటే కాగితాలలో...నేతల ప్రసంగాలలో మాత్రమే కనబడేది. కానీ ఇప్పుడు అభివృద్ధి కళ్ళకు కనబడుతోంది. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజల చేతికి అందుతున్నాయి కూడా. రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇది నిజమని అందరూ అంగీకరిస్తారు. 

ఇదంతా...ప్రజలు విజ్ఞతతో సరైన వ్యక్తికి, పార్టీకి అధికారం కట్టబెట్టడం వలననే సాధ్యమైందని చెప్పవచ్చు. ప్రజలు అప్పజెప్పిన ఈ క్లిష్టమైన బాధ్యతను సవాలుగా స్వీకరించిన సిఎం కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో, పట్టుదలతో కృషి చేస్తూ తాను కలలు కన్న బంగారి తెలంగాణ కలను సాకారం చేసి చూపించారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది. కేంద్రంతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మార్పుకు దోహదపడిన సిఎం కేసీఆర్‌కు, ఆయన నాయకత్వంలో సైనికులులాగా అత్యంత సమర్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు వారిని ఎన్నుకొన్న రాష్ట్ర ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా మైతెలంగాణ.కాం శుభాకాంక్షలు తెలియజేస్తోంది.


Related Post