కొండపోచమ్మ రిజర్వాయరులోకి నీటిని విడుదల చేసిన కేసీఆర్

May 29, 2020


img

సిఎం కేసీఆర్‌ కొద్ది సేపటి క్రితం మర్కూక్ పంప్‌హౌస్‌లో మోటార్‌ను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయరులోకి నీటిని విడుదల చేశారు. త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి హరీష్‌రావుతో సహా పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మోటార్‌ను ఆన్‌ చేసిన తరువాత సిఎం కేసీఆర్‌ దంపతులు, చినజీయర్ స్వామి తదితరులు నీళ్ళు విడుదలయ్యే (డెలివరీ పాయింట్) చోటికి వెళ్ళి పూలతో గోదారమ్మకు ప్రత్యేకపూజలు చేశారు. అంతకు ముందు సిఎం కేసీఆర్‌ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో జరిగిన చండీయాగంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మర్కూక్ పంప్‌హౌస్‌లో త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో జరిగిన సుదర్శనయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.  

కరోనా నేపధ్యంలో ప్రజలను ఈ కార్యక్రమానికి రావద్దని మంత్రులు, అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ తమ ఊర్లకు ఉరకలేస్తూ తరలివస్తున్న గోదారమ్మను కళ్ళారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది ప్రజలు తరలివచ్చారు. మర్కూక్ పంప్‌హౌస్‌లో సిఎం కేసీఆర్‌ మోటార్‌ను ఆన్‌ చేయగానే కొండపోచమ్మ రిజర్వాయరులోకి  ఉవ్వెత్తున పొంగి ప్రవహిస్తున్న నీటిని చూసి వారందరూ తన్మయత్వంలో మైమరిచిపోయారు. ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.


Related Post