తెలంగాణ జిల్లాలలో మళ్ళీ కరోనా కేసులు!

May 27, 2020


img

తెలంగాణలో కొన్ని జిల్లాలలో మళ్ళీ కరోనా కేసులు బయటపడుతున్నాయి. మంగళవారం రంగారెడ్డి-7,మేడ్చల్లో-6, జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 కేసులు, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట జిల్లాలలో ఒక్కో పాజిటివ్ కేసు బయటపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇవి కాక 12 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో మంగళవారం ఒక్కరోజే మొత్తం 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే గత 10 రోజులలో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,991కి చేరింది. 

నిన్న 120 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,284 మంది కోల్కొన్నట్లయింది. నిన్న ఒక వ్యక్తి మరణించడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 57కి చేరింది. 

రాష్ట్రంలో వరంగల్‌ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఆ మూడు జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

గత 14 రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ జిల్లాలు: కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ అర్బన్, గద్వాల్, జనగావ్, నిర్మల్ జిల్లాలు.


Related Post