వేసవిలో నీళ్ళు పారుతాయని ఎప్పుడైనా ఊహించారా?

May 26, 2020


img

ఈరోజు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కలిసి రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాఫాబాద్‌లో రైతువేదిక భవనానికి, రాచర్లగొల్లపల్లిలో వ్యవసాయ గోదాము నిర్మాణానికి శంఖుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “స్వయంగా రైతు అయిన సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రైతన్నలందరికీ మేలు చేయాలనే సంకల్పంతోనే గత ఆరేళ్ళలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కేవలం మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతన్నల నీటి కష్టాలు తీర్చారు. గతంలో ఏనాడైనా ఊహించామా ఈ మండు వేసవిలో మన ఊర్ల మద్యలో నుంచి ఇలా గోదావరి నీళ్ళు గలగల పారుతాయని? ఏనాడైనా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ లభిస్తుందని ఊహించామా? కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తరువాత కాలువలలో నీళ్ళు నిండుగా పారుతుండటంతో సిరిసిల్లా జిల్లాలో భూగర్భజలాలు సుమారు 6 మీటర్లు పెరిగాయి. 

రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా మన ప్రభుత్వం పంటరుణాల మాఫీ, రైతు బంధు, నిరంతర ఉచిత విద్యుత్, రైతు భీమా వంటి అనేకానేక సంక్షేమ పధకాలను అమలుచేస్తోంది. వ్యవసాయం లాభసాటిగా మార్చి రైతన్నలను కూడా ధనవంతులు చేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో ఇప్పుడు నియంత్రిత పంటల విధానం అమలుచేయాలని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. కానీ ఏనాడూ రైతులను పట్టించుకోని ప్రతిపక్ష నేతలు దీనిపై కూడా దుష్ప్రచారం చేస్తూ రైతులను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తూ బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రైతుల గురించి ఇంతగా ఆలోచించి ఇన్ని పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సిఎం కేసీఆర్‌ తన రైతులకు అన్యాయం చేయాలని ఎందుకు అనుకొంటారు? అసలు ఆయనకు ఆ అవసరం ఏమిటి? అని ఒకసారి మీరందరూ ఆలోచించాలి. 

ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గోదావరి జలాలను ఏపీకి తరలించుకుపోతుంటే హారతులు పట్టిన కాంగ్రెస్‌ నేతలే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందంటూ సిఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ సిఎం కేసీఆర్‌ వారి విమర్శలకు భయపడి వెనక్కు తగ్గకుండా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు పారించాలనే గొప్ప లక్ష్యంతో ముందుకు సాగిపోతున్నారు. ఆనాడు కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఏవిధంగా ఉండేది ఇప్పుడు సిఎం కేసీఆర్‌ పాలనలో ఏవిధంగా ఉందో మీకే తెలుసు. కళ్ళకు కనిపించే విధంగా అభివృద్ధి జరుగుతోంది. రైతు బాగుంటేనే రాష్ట్రం... దేశం కూడా బాగుంటుందని నమ్మే వ్యక్తి సిఎం కేసీఆర్‌. కనుకనే రైతులు మరింత లాభపడాలనే ఉద్దేశ్యంతోనే ఈ నియంత్రిత పంటల విధానాన్ని అమలుచేయాలని కోరుతున్నారు. దీని వలన ఎంత లాభం ఉంటుందో మీరే స్వయంగా చూస్తారు,” అని అన్నారు. 


Related Post