అజ్ఞాతవాసం వీడిన చంద్రబాబునాయుడు

May 25, 2020


img

ఏపీ మాజీ సిఎం ఎట్టకేలకు అజ్ఞాతవాసం వీడి ఈరోజు ప్రజల మద్యకు వస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌ వెళ్ళిన ఆయన నేటి వరకు ఏపీకి తిరిగి రాలేకపోయారు. దాంతో అక్కడి నుంచే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని డ్డీకొంటున్నారు. ఆయన కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కొని నీచ రాజకీయాలు చేస్తునారని, దమ్ముంటే ఏపీకి రావాలని వైసీపీ నేతలు, మంత్రులు పదేపదే ఆయనకు సవాలు విసిరారు. కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఈరోజు విమానంలో విజయవాడకు బయలుదేరాలనుకొన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం అభ్యర్దన మేరకు ఏపీకి ఈరోజు బదులు రేపటి నుంచి విమానాలు నడిపిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌ పురి ప్రకటించడంతో, చంద్రబాబునాయుడు కారులో రోడ్డు మార్గాన్న విజయవాడకు బయలుదేరారు. కొద్ది సేపటి క్రితమే చంద్రబాబునాయుడి కాన్వాయ్ గరికపాడు చెక్ పోస్టు దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. 

చంద్రబాబునాయుడు రేపు లేదా ఎల్లుండి విశాఖలో గ్యాస్ బాధితులను కలిసి మాట్లాడాలనుకొంటున్నారు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవచ్చు. ఆయన హైదరాబాద్‌ నుంచి వచ్చారు కనుక 14 రోజులు క్వారెంటైన్ లో ఉండాలని కోరినా ఆశ్చర్యం లేదు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నంత కాలం కరోనాకు భయపడి అక్కడ దాక్కొన్నారని ఎద్దేవా చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఏపీకి తిరిగివస్తుంటే విశాఖ ప్రజలను రెచ్చగొట్టేందుకే వస్తున్నారని ఆరోపిస్తుండటం విశేషం. 

తాను ఈరోజు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరబోతున్నట్లు ముందుగా ప్రకటించడం వలననే జగన్ ప్రభుత్వం ఏపీకి విమానసేవలు ఈరోజుకు బదులు రేపటి నుంచి ప్రారంభించాలని కోరారని చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఇటువంటి పోటాపోటీ రాజకీయాలు సాగేవి కానీ ఇప్పుడు ఏపీలో సాగుతున్నాయి.


Related Post