ఈనెల 15 నుంచి రైలు, విమాన సేవలు ప్రారంభం?

April 04, 2020


img

కేంద్రప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఈనెల 15వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా మళ్ళీ రైళ్లు, విమానసేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 15వ తేదీ నుంచి అన్ని రైళ్లను నడిపించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, తదుపరి ఉత్తర్వులు అందగానే రైల్వే ఉద్యోగులందరూ విధులకు హాజరయ్యేందుకు సిద్దంగా ఉండాలని రైల్వేశాఖ దేశంలో అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒకవేళ రైలు సర్వీసులు ప్రారంభం అయితే, కరోనా నేపద్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై రైల్వే అధికారులు చర్చిస్తున్నారు. ఈనెల 15 నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభం కావాలంటే ఇప్పటి నుంచే టికెట్ రిజర్వేషన్లను కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. కనుక ఒకటి రెండు రోజులలోనే కేంద్రప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 

ఏప్రిల్ 15న కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ పూర్తిగా లేదా పాక్షికంగా ఎత్తివేసినా పౌరవిమాన సంస్థలు కూడా దేశీయంగా విమానసేవలు ప్రారంభించాలని భావిస్తున్నాయి. గో ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, విస్తారా ఎయిర్ లైన్స్ సంస్థలు ఏప్రిల్ 15 నుంచి విమానసేవలు ప్రారంభించేందుకు టికెట్స్ బుకింగ్స్ ప్రారంభించాయి. కానీ కేంద్రప్రభుత్వం అనుమతిస్తేనే ఏప్రిల్ 15 నుంచి విమానసేవలు ప్రారంభిస్తామని ప్రయాణికులకు ముందే తెలియజేస్తున్నాయి. ఎయిర్ ఇండియా సంస్థ మాత్రం ఏప్రిల్ 30వరకు జాతీయ, అంతర్జాతీయ విమానసేవలను నడపరాదని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. మే1 తేదీ నుంచి అంతర్జాతీయ విమానసేవలు ప్రారంభించాలని అన్ని సంస్థలు భావిస్తున్నాయి. అప్పటికి విదేశాలలో కూడా కరోనా వైరస్‌ పూర్తిగా నియంత్రణలోకి రావచ్చని భావిస్తున్నాయి.


Related Post