9 నిమిషాలు లైట్లు ఆర్పితే ఏమీ కాదు: ప్రభాకర్ రావు

April 04, 2020


img

రేపు (ఆదివారం) రాత్రి  9 గంటల నుంచి 9 నిమిషాలసేపు దేశప్రజలందరూ తమ ఇళ్లలోని లైట్లు ఆర్పివేసి, ఇంటి బయట దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి కరోనాపై పోరాటానికి సంఘీభావం తెలియజేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాని వలన ఒక్కసారిగా దేశంలో విద్యుత్ వినియోగం తగ్గి విద్యుత్ గ్రిడ్స్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని విద్యుత్ రంగ నిపుణులు, ఇంజనీర్లు చెపుతున్నారు. మీడియాలో వస్తున్న ఈ వార్తలను తెలంగాణ  జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు కొట్టిపాడేశారు. 

విద్యుత్ గ్రిడ్స్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొన్నట్లయితే ఎటువంటి సమస్యలు తలెత్తవని అన్నారు. తెలంగాణ పవర్ గ్రిడ్ లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొన్నామని చెప్పారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూతపడటం వలన విద్యుత్ వినియోగం తగ్గిన మాట వాస్తవమే కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు ప్రజలందరూ ఇళ్ళలోనే ఉండిపోవడంతో గృహవిద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అన్నారు. 

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు భారీగా విద్యుత్ వినియోగమవుతున్నందున విద్యుత్ ఉత్పత్తి, వినియోగం చక్కగా బ్యాలన్స్ అవుతున్నాయని అన్నారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ సూచన మేరకు రేపు రాత్రి రాష్ట్రంలో ప్రజలందరూ తమ ఇళ్ళలో లైట్లు ఆర్పివేసినప్పటికీ తెలంగాణ పవర్ గ్రిడ్ లో ఎటువంటి సమస్యలు రావని అన్నారు. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపధ్యంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించాలని ప్రభాకర్‌ రావు విజ్ఞప్తి చేశారు.


Related Post