తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మళ్ళీ జీతాల సమస్య?

April 04, 2020


img

55 రోజుల సమ్మెతో నష్టాలలో మునిగిపోయిన ఆర్టీసీ సంస్థను మళ్ళీ గాడిన పెట్టేందుకు సిఎం కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే దేశంపై కరోనా విరుచుకుపడటం, దానిని అడ్డుకొనేందుకు మూడు వారాలు లాక్‌డౌన్‌ ప్రకటించడం జరిగింది. దాంతో ఆర్టీసీ బస్సులన్నీ మళ్ళీ డిపోలలోనే నిలిచిపోయాయి. కనుక తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఆదాయం కోల్పోయి మళ్ళీ నష్టాలలో మునిగిపోయింది. కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడింది. దాంతో మార్చి నెల జీతాలలో 50 శాతం కోత విధించింది. అది కూడా ఇంతవరకు చెల్లించలేదు. లాక్‌డౌన్‌ ప్రకటించక మునుపు మార్చి మొదటి రెండువారాలలో వచ్చిన ఆదాయాన్ని కార్మికుల జీతాలకు సర్దుబాటు చేసి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సమ్మె కాలంలో సుమారు రెండు నెలలు జీతాలు లేక అష్టకష్టాలు పడిన ఆర్టీసీ కార్మికులకు మళ్ళీ కొత్త కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం క్షీణించినందున తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పెన్షనర్లు, ప్రభుత్వోద్యోగులందరికీ జీతాలలో కోతలు విధించిన సంగతి తెలిసిందే. కనుక ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆదుకోలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఈ నెల 14 తరువాత లాక్‌డౌన్‌ ఇంకా పొడిగించినట్లయితే వచ్చే నెల ఆర్టీసీ కార్మికులకు జీతాల చెల్లింపుకు ఇంకా కష్టం అవుతుంది.


Related Post