మోడీజీ..ఈ జిమ్మికులు మానుకోండి: అసదుద్దీన్

April 04, 2020


img

దేశప్రజలందరూ కలిసికట్టుగా కరోనాపై పోరాడుతున్నామని సూచించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల సేపు తమ ఇళ్ళలో లైట్లన్నీ ఆర్పివేసి, ఇళ్ళ బయట దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని లేదా మొబైల్ ఫోన్లలో లైట్ ఆన్‌ చేసి ప్రదర్శించాలని ప్రధాని నరేంద్రమోడీ చేసీనా సంగతి తెలిసిందే.  దానిపై మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. 

“ఈ దేశం ఈవెంట్ మేనేజిమెంట్ కంపెనీ కాదు. దేశప్రజలకు అనేక ఆశలు, కలలు ఉన్నాయి. మీరు మా జీవితాలను 9 నిమిషాల జిమ్మిక్కుకు కుదించవద్దు. ఇంతవరకు కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఎంత సహాయం చేసింది? పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకొన్నారో తెలియజేయకుండా ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టారు,” అని ట్వీట్ చేశారు.     

  

మరో ట్వీట్‌లో, “మన బ్యాంకింగ్ రంగాన్ని అలుముకొంటున్న చీకటి మాటేమిటి ప్రధానిగారు? నానాటికీ పెరుగుతున్న మన ఎన్‌పీఎ సమస్య తీరనేలేదు. కరోనాకు ముందు నుంచే దేశంలో నెలకొన్న ఆర్ధికసంక్షోభం ఇప్పుడు అతిపెద్ద ఆర్ధిక సంక్షోభంగా మారాబోతోంది. అదేకనుక జరిగితే ప్రజలు పొదుపుచేసుకొన్న డబ్బు ఏమవుతుంది? బ్యాంకుల పరిస్థితి ఏమవుతుంది?” అని ట్వీట్ చేశారు. 


మరో ట్వీట్‌లో, “హటాత్తుగా లాక్‌డౌన్‌ చేయడంవలన దేశంలో పేదప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. మీరు వారినందరినీ దేశంలో దాతల దయకు, పరిమిత నిధులు కలిగిన రాష్ట్ర ప్రభుత్వాల దయకు విడిచిపెట్టేశారు. ముఖ్యమంత్రులు నిధులు కావాలని కోరితే మీరు లైట్లు ఆపివేయమని వారికి సలహా ఇస్తున్నారు?” అని అన్నారు.

      

మరో ట్వీట్‌లో, “మీరు చెప్పుకొంటున్న లక్షలు, కోట్లు ఆర్ధికసాయం దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాదిమందికి చేరేలా చేయండి,” అని అన్నారు.


Related Post