దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి

April 03, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడిన వీడియో సందేశాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి. ఆ సందేశంలో ప్రధాని నరేంద్రమోడీ ఎమన్నారంటే, “కరోనా మహమ్మారిపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో అన్ని వ్యవస్థలు, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పోరాడుతున్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వాలకు సహకరిస్తున్న దేశప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. జనతా కర్ఫ్యూతో దేశప్రజల సమైక్యతను లోకానికి చాటిచెప్పిన భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మనం ఒక్కరే ఇంట్లో కూర్చోంటే ఏవిధంగా కరోనాను అరికట్టగలము? అని చాలా మంది సందేహపడుతున్నారు. కానీ మనం ఒంటరిగా పోరాడటం లేదు. దేశంలో 130 కోట్ల మంది ప్రజలందరూ తమ ఇళ్ళలో ఉండిపోవడం ద్వారా కరోనాపై పోరాటంలో పాలుపంచుకొంటున్నారని గ్రహించాలి. కనుక దేశప్రజలందరూ మరికొన్ని రోజులు ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా ఉంటేనే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలము. కరోనాపై విజయం సాధించగలము. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచదేశాలన్నీ మెచ్చుకొని అనుసరిస్తున్నాయి. కనుక మనమందరం మరింత క్రమశిక్షణగా మెలుగుతూ కరోనాపై విజయం సాధించవలసి ఉంది.

మనమంతా కలిసి కరోనాపై పోరాడుతున్నామని చాటి చెప్పేందుకు దేశప్రజలందరూ ఈ ఆదివారం (ఏప్రిల్ 5వ తేదీ) రాత్రి 9 గంటలకు తమ ఇళ్ళలో లైట్లు ఆర్పివేసి బయట దీపాలు, కొవ్వొత్తులు  వెలిగించాలి. అది సాధ్యం కానివారు తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈవిధంగా ఎందుకు చేయమని ప్రజలను కోరుతున్నానంటే దేశంలో ఏ ఒక్కరూ ఒంటరిగా లేరు... యావత్ దేశప్రజలు మనతో ఉన్నారని చాటి చెప్పేందుకు. కనుక ఆదివారం రాత్రి ఒక 9 నిమిషాల సమయం దేశం కోసం కేటాయించాలని దేశప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 


Related Post