ఇప్పుడు భూసేకరణ చేపట్టడం ఏమిటి: రేవంత్‌ రెడ్డి

April 01, 2020


img

కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతుంటే ఈ సమయంలో రంగారెడ్డిజిల్లాలో ఫార్మా సిటీ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయసేకరణకు మేడిపల్లి, నానాక్‌రాంగూడా గ్రామాలలో ఏప్రిల్ 3న గ్రామసభలు నిర్వహించబోతున్నట్లు అధికారులు నోటీసు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి తప్పుపట్టారు. ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉండగా ఏప్రిల్ 3న ఏవిధంగా గ్రామసభ నిర్వహిస్తారని లేఖలో ప్రశ్నించారు. ఆ ఆలోచనను విరమించుకోవాలని రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను స్వాగతిస్తూనే మరింత కటినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉన్నతోద్యోగుల జీతాలలో కోత విధించడం సరైనదే కానీ క్లాస్-4 ఉద్యోగుల జీతాలలో 10 శాతం కోత విధించడం సరికాదన్నారు. ఈ విపత్కర పరిస్థితులలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పారిశుద్య కార్మికులకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి జీతాలలో కోతలు విధించడం సరికాదని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కనుక ఆ నిర్ణయాన్ని సిఎం కేసీఆర్‌ ఉపసంహరించుకోవాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 



Related Post