అది అందుబాటులోకి వస్తే 5 నిమిషలలోనే కరోనా టెస్ట్ రిపోర్ట్

March 28, 2020


img

కరోనా వైరస్‌ను గుర్తించడంలో జరుగుతున్న ఆలస్యం కారణంగానే అది శరవేగంగా ప్రపంచమంతా వ్యాపించి వేలాదిమందిని బలిగొంటోంది. ప్రస్తుతం కరోనాకు ఎక్కువగా బలవుతున్న దేశం అమెరికాయే. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 16,000 కొత్త కేసులు నమోదు అవడంతో కరోనా పాజిటివ్ రోజుల సంఖ్య 1,04, 671కి చేరింది. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 1,176 మంది కరోనాతో మృతి చెందారు. కనుక కరోనాను అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టింది. 

కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో అనేక ఔషద కంపెనీలు, పరిశోధనాకేంద్రాలు, ప్రయోగశాలలు పాలుపంచుకొంటున్నాయి. అమెరికాలోని ప్రసిద్ద హెల్త్ కేర్ సంస్థ అబ్బాట్ కరోనా వ్యాధినిర్ధారణకు ఒక కొత్త పరికరాన్ని తయారుచేసింది. చిన్న పెట్టె వంటి ఆ పరికరాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడకు సులువుగా తీసుకుపోవచ్చు. దాంతో కేవలం 5 నిమిషాలలోనే కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. కేవలం 13 నిమిషాలలో పూర్తి రిపోర్టు అందిస్తుందని అబాట్‌ అధ్యక్షుడు, సీఓఓ రాబర్ట్‌ ఫోర్డ్‌ తెలిపారు. దీనికి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. కనుక త్వరలోనే ఈ సూపర్ ఫాస్ట్ కరోనా టెస్టింగ్ కిట్స్ భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి వైద్యులకు అందుబాటులోకి తెస్తామని రాబర్ట్ ఫోర్డ్ చెప్పారు. 

ప్రస్తుతం మనదేశంలో కరోనా వైరస్‌ను గుర్తించడానికి కనీసం 24 గంటల సమయం పడుతోంది. అది కూడా కేంద్రప్రభుత్వం అనుమతించిన కొన్ని పరిశోధన సంస్థలలోనే పరీక్షిస్తుండటంతో రిపోర్టులు రావడంలో చాలా ఆలస్యమవుతోంది. మరోపక్క రోజురోజుకు కరోనా అనుమానిత కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ఆ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోతోంది. వ్యాధి నిర్ధారణ కావడంలో ఆలస్యం కారణంగా సాధారణ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారిని కూడా ఐసోలేషన్ వార్డులలో ఉంచవలసి వస్తోంది. ఇది కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు చాలా భారంగా మారుతోంది. కనుక అబ్బాట్ తయారుచేసిన ఈ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి వస్తే అన్ని దేశాలకు చాలా ఉపయోగపడతాయి. 

చైనా, అమెరికా, భారత్‌తో సహా పలు దేశాలు కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్నాయి. ఇప్పటికే చైనాలో క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలైనట్లు సమాచారం. అవి సత్ఫలితాలు ఇస్తే మరో 7-8 నెలలో కరోనాకు విరుగుడు మందు మార్కెట్లలోకి వస్తుంది. కనుక అంతవరకు ప్రజలందరూ అప్రమత్తంగా మెలగక తప్పదు.


Related Post