మరో మూడువారాలు భారత్‌ లాక్‌డౌన్‌: మోడీ

March 24, 2020


img

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నేటి అర్ధరాత్రి నుంచి మరో మూడువారాల పాటు యావత్ దేశమంతా లాక్‌డౌన్‌ చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. మంగళవారం రాత్రి మీడియా ద్వారా దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జనతా కర్ఫ్యూను విజయవంతం చేసి దేశానికి విపత్తువస్తే కలిసికట్టుగా నిలబడి పోరాడుతామని దేశప్రజలు నిరూపించారు. అందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. కానీ మరో మూడు వారాలపాటు మనం ఇదేవిధంగా సామాజికదూరం పాటించగలిగినప్పుడే కరోనా వైరస్‌ నుంచి దేశానికి విముక్తి కల్పించగలుగుతాము. కనుక నేటి అర్ధరాత్రి నుంచి మూడు వారాలపాటు యావత్ దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది.

అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు గడప దాటి బయట అడుగుపెడితే బయట ఉన్న కరోనా వైరస్‌ను చేజేతులా మీ ఇంట్లోకి తెచ్చుకొంటున్నారని మరిచిపోవద్దు. కరోనా నివారణకు మీరు చేయవలసిందేమీ లేదు. కేవలం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే చాలు. ఓ మూడు వారాలపాటు మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిగ్రహించుకోగలిగితే కరోనా వైరస్‌ను మట్టుపెట్టడం కష్టం కాదు. మన దేశహితం కోసం..మీకోసం...మీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలని చేతులు జోడించి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post