రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

February 25, 2020


img

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. వీటికి సంబందించి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆరోజు నుంచి మార్చి 13వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 18. మార్చి 26 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు. 

రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 6 స్థానాలుండగా వాటిలో ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలున్నాయి. తెలంగాణలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌), గరికపాటి రాంమోహన్ రావు(బిజెపి) రాజ్యసభ్యులుగా ఉన్నారు. ఏపీ కోటాలో కెకేశవరావు (టిఆర్ఎస్‌) టి.సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్‌), ఎంఏ ఖాన్(కాంగ్రెస్‌), తోట సీతారామలక్ష్మి (టిడిపి) రాజ్యసభ్యులుగా ఉన్నారు. వీరందరి పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. కనుక వారి స్థానాలలో కొత్తవారిని ఎన్నుకొనేందుకు మార్చి 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. 

రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకొంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలకు తమ అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు తగినంతమంది ఎమ్మెల్యేలులేరు కనుక రెండు సీట్లు టిఆర్ఎస్‌ దక్కించుకోనుంది. అయితే ఆ రెండు సీట్లకు సిఎం కేసీఆర్‌ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. వాటిలో ఒక సీటు తన కుమార్తె కవితకు కేటాయించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Related Post