తెలంగాణలో నేటి నుంచి పట్టణ ప్రగతి

February 24, 2020


img

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నేటి నుంచి 10 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుచేయబోతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామీణప్రజలు అందరూ కలిసి గ్రామాలను శుభ్రపరుచుకొని, కొత్తగా మొక్కలు నాటారు. చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. పల్లె ప్రగతితో సత్ఫలితాలు సాధించడమే కాకుండా ఆ కార్యక్రమానికి  మంచి ప్రజాధారణ కూడా వచ్చింది. ఆ స్పూర్తితోనే ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేయడానికి అందరూ సిద్దం అయ్యారు. 

నేటి నుంచి ప్రారంభంకానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలక్టర్లు, కొత్తగా నియమితులైన అదనపు కలక్టర్లు, చైర్‌పర్సన్‌లు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ పాల్గొంటారు. నేటి నుంచి అన్ని పట్టణాలలో రోడ్లు మరమత్తులు, కాలువలలో పేరుకుపోయిన చెత్తను, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగించే కార్యక్రమం మొదలవుతుంది. ఈ సమయంలోనే ఆయా వార్డులలో గుర్తించిన వివిద సమస్యల పరిష్కారానికి అధికారులు అవసరమైన చర్యలు చేపడతారు. పదిరోజుల పట్టణప్రగతి కార్యక్రమం పూర్తయిన తరువాత రాష్ట్రంలోని హైదరాబాద్‌తో సహా అన్ని నగరాలు, పట్టణాలలో ఈ ఏడాది మే నెలాఖరులోగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తారు. అక్టోబరులోగా పాడైపోయిన ట్రాన్స్ ఫార్మార్లను, విద్యుత్ స్థంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. 

పట్టణప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తానని, కొన్ని ప్రాంతాలలో స్వయంగా పరిశీలిస్తానని సిఎం కేసీఆర్‌ తెలిపారు. కనుక ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సత్ఫలితాలు సాధించినవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని, అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ ముందే ప్రకటించారు.


Related Post