ప్రాణం తీసిన మద్యంమత్తు, అతివేగం

February 24, 2020


img

హైదరాబాద్‌లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మద్యంమత్తు, అతివేగం లేదా నిర్లక్ష్యం కారణాలవుతున్నాయి. హైదరాబాద్‌ కర్మాన్‌ఘాట్ చౌరస్తావద్ద శనివారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సైదాబాద్‌ మాధవనగర్‌ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన వినాయక్‌ మల్లికార్జున్‌ (29), సరస్వతీనగర్‌కు చెందిన పబ్బా సాయినాథ్‌ (27), మహబూబాబాద్‌కు చెందిన శ్రీరామ్‌(28) ఈ ప్రమాదంలో మరణించగా కొత్తపేట మారుతీనగర్‌కు చెందిన కల్యాణ్‌ (27) తీవ్రగాయాలతో బయటపడ్డాడు. అతను కారు వెనక సీట్లో కూర్చోన్న కల్యాణ్‌ సీటు బెల్టు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మద్యంమత్తులో అతివేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. 

వారు నలుగురు స్నేహితులు. శనివారం వారాంతపు శలవు కావడంతో గుల్జార్‌, యువమిత్ర అనే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సాగర్‌రోడ్డు గుర్రంగూడలోని భవానీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో అర్ధరాత్రివరకు మద్యం సేవించారు. అర్ధరాత్రి దాటిన తరువాత గుల్జార్‌, యువమిత్ర తమ బైక్‌పై వెళ్లిపోగా, మిగిలిన నలుగురు కారులో ఇళ్లకు బయలుదేరారు. వారి కారు కర్మాన్‌ఘాట్ చౌరస్తాలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టును డ్డీకొంది. అక్కడి నుంచి పల్టీలు కొడుతూ 30 అడుగుల దూరంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని డ్డీకొంది. మళ్ళీ అక్కడి నుంచి పల్టీలు కొడుతూ మరో 15 అడుగుల దూరంలో ఉన్న టిఫిన్ సెంటరును డ్డీకొని నిలిచిపోయింది. ప్రమాదసమయంలో కారు గంటకు 120-150 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నందునే  అన్ని పల్టీలు కొట్టిందని పోలీసులు తెలిపారు. 

మృతులలో మల్లికార్జున్, శ్రీరామ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సాయినాథ్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. గాయాలతో బయటపడ్డ కళ్యాణ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. 


Related Post