ట్రంప్ భారత్‌ పర్యటన నేడే

February 24, 2020


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌ పర్యటన నేటి నుంచి ప్రారంభం అవుతుంది. ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 11.40 గంటలకు వారి ప్రత్యేక విమానం ‘ఎయిర్ ఫోర్స్-1’ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంటుంది. వారికి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, కేంద్రరాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. 

ఆ తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ కలిసి రోడ్డు మార్గంలో సబర్మతీ ఆశ్రమానికి చేరుకొంటారు. ఆ మార్గంలో 22 కిమీ దారిపొడవునా సుమారు లక్షమంది ప్రజలు ట్రంప్ దంపతులకు స్వాగతం పలుకుతారు. ఆ మార్గంలో ఏర్పాటు చేసిన 28 వేదికల వద్ద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే కళారూపాలను ప్రదర్శిస్తారు.     

ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా సబర్మతీ ఆశ్రమాన్ని చూపించి దాని ప్రాధాన్యత గురించి ట్రంప్ దంపతుల వివరిస్తారు. అక్కడ వారు సుమారు 20 నిమిషాలు ఉంటారు. ఆ తరువాత డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ కలిసి అక్కడి నుంచి అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియంకు చేరుకొని దానికి ప్రారంభోత్సవం చేస్తారు. స్టేడియంలో సుమారు లక్షమంది ప్రజలతో డోనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ ‘నమస్తే ట్రంప్’ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు.  బాలీవుడ్‌ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌ నేతృత్వంలో సంగీత,సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం డొనాల్డ్ ట్రంప్ దంపతులు మధ్యాహ్నం 3.30కు ఆగ్రాకు బయలుదేరి 4.45గంటలకు చేరుకొంటారు. అక్కడ వారు తాజ్ మహల్‌ అందాలను చూసి, సాయంత్రం 6.45 గంటలకు డిల్లీ బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు డిల్లీలో హోటల్‌ మౌర్య షెరాటన్‌లో చేరుకొని రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకొంటారు. 


Related Post