సర్నేనిగూడెంలో విషాదం...సర్పంచ్ భర్త, కొడుకు మృతి

February 22, 2020


img

యాదాద్రిభువనగిరి జిల్లా సర్నేనిగూడెం సర్పంచ్ రాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త మధు, కుమారుడు మత్స్యగిరి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గ్రామానికి సమీపంలోగల ఎల్లంకిచెరువులో దూసుకుపోవడంతో వారు కారు డ్రైవరు శ్రీధర్ రెడ్డి ముగ్గురూ చనిపోయారు. 

శుక్రవారం రాత్రి వారు పొరుగూరుకు వెళ్ళిన భర్త, కొడుకు ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో సర్పంచ్ రాణి పోలీసులను ఆశ్రయించగా వారు శుక్రవారం రాత్రి నుంచి పరిసర ప్రాంతాలలో గాలించారు. చివరికి సిసి కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా వారి కారు ఎల్లంకి చెరువుకట్ట వరకు వెళ్ళినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో గాలించగా చెరువులోకి కారు దూసుకుపోయిన ఆనవాళ్ళు కనిపించాయి. శనివారం ఉదయం చెరువులో గజఈతగాళ్ళు గాలించి కారును కనుగొన్నారు. అనంతరం క్రేన్ సాయంతో కారును వెలికితీయగా ముగ్గురి శవాలు లభించాయి. 

వారు ఇంటికి తిరిగివస్తుండగా ఎల్లంకి చెరువుకట్టపై వారి కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటువంటి ప్రమాదాన్ని ఊహించని వారు షాక్ నుంచి తేరుకొనేలోగా కారు పూర్తిగా నీళ్ళలో మునిగిపోవడంతో దానిలో నుంచి బయటకు రాలేక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి భర్త, కొడుకును కోల్పోవడంతో సర్పంచ్ రాణి కన్నీరు మున్నీరుగా విలపించారు. సాయంత్రం వరకు తమతో కబుర్లు చెప్పిన సర్పంచ్ భర్త మధు చెరువులో శవమై తేలడంతో సర్నేనిగూడెంలోనివారు దిగ్బ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్టుమార్టంకు తరలించారు.


Related Post