నేడు మహాశివరాత్రి...వేములవాడలో భక్తుల రద్దీ

February 21, 2020


img

నేడు మహాశివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా శివాలయాలు, శివక్షేత్రాలు తెల్లవారుజామునుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం నుంచి మహాశివరాత్రి జాతర ప్రారంభం అయ్యింది. మూడు రోజులపాటు సాగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటారు. ఇప్పటికే వేములవాడలో సుమారు లక్షన్నరకు పైగా భక్తులు తరలివచ్చారు. మిగిలిన ఈ రెండు రోజులలో మరో 3-4 లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన ఆలయ, జిల్లాఅధికారులు అందుకు తగ్గట్లుగా భారీగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మూడు రోజులు కోడెమొక్కులు తప్ప మిగిలిన ఆర్జితసేవలన్నీ నిలిపివేసి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. 




ఆనవాయితీ ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రులు ఈటెల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.   

భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌ మండలం కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ కూడా మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. దక్షిణకాశీగా ప్రసిద్ది చెందిన ఈ శివక్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఒకే పాంపట్టంపై పక్కపక్కన రెండు శివలింగాలుంటాయి. కనుక ఆ స్వామివారిని దర్శించుకొంటే ఈ జన్మతో సహా ఏడు జన్మలపాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. 

రాష్ట్రంలో ప్రసిద్ద శివక్షేత్రాలలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా, కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వరస్వామి శివాలయం కూడా ఒకటి. హైదరాబాద్‌ శివార్లలో ఉన్న ఈ ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ మొదలైంది.


Related Post