త్వరలో తెలంగాణ యూనివర్సిటీలకు వీసీల నియామకం

February 20, 2020


img

త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సిలర్స్ నియామకం జరుగనుంది. సిఎం కేసీఆర్‌ బుదవారం ప్రగతి భవన్‌లో సంబందిత అధికారులతో సమావేశమయ్యి మూడు వారాలలోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. వీసీల నియామకం కోసం ముందుగా సెర్చ్ కమిటీ సిఫార్సు మేరకు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్లను నియమించాలని ఆదేశించారు. సుమారు రెండు నెలల క్రిందటే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీల నియామకం జరిగింది. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ స్వయంగా ఆదేశించారు కనుక త్వరలోనే సెర్చ్ కమిటీలు  సమావేశమయ్యి వీసీ నియామక ప్రక్రియను ప్రారంభించనున్నాయి. 

ఉస్మానియా, కాకతీయ తరువాత రాష్ట్రంలో మూడవ పెద్ద యూనివర్సిటీగా నిలుస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ పదవికి గట్టి పోటీ నెలకొంది. మొదట ఓసీ, తరువాత వరుసగా మైనార్టీ, దళిత సామాజిక వర్గానికి చెందినవారికి వైస్ ఛాన్సిలర్ పదవి లభించింది కనుక ఈసారి బీసీ సామాజికవర్గానికి లభిస్తుందనే నమ్మకంతో ఆ వర్గానికి చెందిన ఒకరిద్దరు వీసీ పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన యూనివర్సిటీలలో కూడా వీసీ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మరో రెండు మూడువారాలలో వీసీ నియామక ప్రక్రియ పూర్తయితే ఏ యూనివర్సిటీకి ఎవరు వీసీగా నియమింపబడుతున్నారో తెలుస్తుంది. 

విద్యా నిలయాలైన యూనివర్సిటీలలో అనుభవం, విద్యార్హతలు, ప్రతిభ, నిబద్దత ఆధారంగా నియామకాలు జరగాలి కానీ వాటిలో కూడా సామాజికన్యాయం పేరుతో ప్రొఫెసర్ల కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయం.


Related Post