అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లు...ఐ‌టి నోటీసులు

February 20, 2020


img

ఇటీవల ఐ‌టిశాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిపిన సోదాలలో శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసంలో పలుకీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అతను హవాలా ద్వారా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లు పంపినట్లు కనుగొన్నారు. ఈ అక్రమలావాదేవీపై ప్రశ్నించేందుకు ఐ‌టి శాఖ ఈనెల 11న అహ్మద్ పటేల్‌కు నోటీసులు పంపించింది. ఈనెల 14న డిల్లీలోని ఐ‌టి కార్యాలయంలో విచారణాధికారి ముందు హాజరుకావాలని నోటీసులలో కోరారు. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొంటున్నందున విచారణకు హాజరుకాలేదు. కనుక మళ్ళీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 

ఇదిగాక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఐ‌టిశాఖ అధికారులు జరిపిన సోదాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ఎం మొయిన్ అనే కార్యకర్త గత ఏడాది ఏప్రిల్ 6న హవాలా ద్వారా రూ.20 కోట్లు అందుకొని దానిని తీసుకొని డిల్లీలో అహ్మద్ పటేల్‌కు అందజేసినట్లు ఐ‌టిశాఖ అధికారులు గుర్తించారు.   

ఈ రెండు కొత్తకేసులే కాక గతంలో స్టెర్లింగ్ బయోటెక్ అనే కంపెనీ రూ.5,700 కోట్లు మనీల్యాండరింగ్ వ్యవహారంపై కూడా ఈడీ అధికారులు అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించారు. కానీ ఆ కేసు విచారణ ఇంకా పూర్తికాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలను చూస్తుంటారు కనుక ఈ అక్రమలావాదేవీలన్నీ కాంగ్రెస్ పార్టీ విరాళాలకోసమే జరిపి ఉండవచ్చునని ఐ‌టిశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.


Related Post