తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు షాక్

February 19, 2020


img

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు రాష్ట్రప్రభుత్వం మళ్ళీ షాక్ ఇచ్చింది. వేతన సవరణ కమీషన్ (పీఆర్సీ) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ జీవో (447) జారీ చేశారు. నిజానికి ఈనెల 24తో పీఆర్సీ గడువు ముగుస్తుంది కనుక పీఆర్సీ అమలుకు సంబందించి ప్రభుత్వం వద్ద ఇప్పటికే సిద్దంగా ఉన్న నివేదికపై సిఎం కేసీఆర్‌ వెంటనే నిర్ణయం తీసుకొంటారని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61కి పెంచడం ద్వారా ఖజానాపై ఎంత భారం పడుతుంది? జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ఏఏ జిల్లాలకు ఎంతమంది ఉద్యోగులు అవసరం? ఉన్న ఉద్యోగులను జిల్లాల వారీగా ఏవిధంగా సర్దుబాటు చేయాలి? ఏఏ జిల్లాలలో ఏఏ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయాలి? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించవలసిందిగా సిఎం కేసీఆర్‌ సంబందిత కమీషనర్‌ను ఆదేశించారు. ఈ పని పూర్తయిన తరువాతే పీఆర్సీని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కనుక పీఆర్సీ కమీషన్ గడువును డిసెంబర్ 31వరకు పెంచవలసిందిగా కోరుతూ పీఆర్సీ కమీషనర్‌ సీఆర్ బిశ్వాల్‌ ప్రభుత్వానికి లేఖ వ్రాయడంతో సోమేష్ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేసారు.  

హుజూర్‌నగర్‌  ఉపఎన్నికల సమయంలో, మళ్ళీ ఆర్టీసీ సమ్మె సమయంలో సిఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల నేతలతో భోజన సమావేశాలలో పీఆర్సీ పట్ల సానుకూలంగా మాట్లాడటంతో వారు ఇంతకాలం దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం డిసెంబర్ 31వరకు (పీఆర్సీ) గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. జూలై 2018 నుంచి అమలుచేయాల్సిన పీఆర్సీని డిసెంబర్ 2020కి వాయిదా వేయడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఖండించారు.


Related Post