పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి, భర్త, కుమార్తె అనుమానాస్పద మృతి

February 17, 2020


img

కరీంనగర్‌ శివారులో అల్గునూరు వద్ద కాకతీయ కెనాల్‌లో ప్రమాదవశాత్తు పడిపోయిన ఓ బైక్‌ను పోలీసులు వెలికితీస్తుండగా ఒక కారు కూడా బయటపడింది. ఆ కారులో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, వారి కుమార్తె వినయశ్రీ మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. 

వారు ముగ్గురూ గత నెల 27వ తేదీన తమ ఇంటి నుంచి కారులో బయలుదేరారు. అప్పటి నుంచి వారు అదృశ్యం అవడంతో ఎమ్మెల్యే మనోహర రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని వారికోసం గాలిస్తున్నారు. కానీ ఇంతవరకు వారి ఆచూకీ కనుగొనలేకపోయారు. 

ఆదివారం రాత్రి గన్నేరు మండల కేంద్రానికి చెందిన పి.వెంకట నారాయణ ప్రదీప్, భార్య కీర్తన కలిసి బైక్‌పై కరీంనగర్‌లో ఓ శుభకార్యానికి హాజరయ్యి సాయంత్రం తిమ్మాపూర్ మండలంలోని శ్రీ తాపాల లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి బయలుదేరారు. ప్రమాదవశాత్తూ వారి బైక్‌ కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి ప్రదీప్ బయటపడ్డాడు కానీ ఆయన భార్య కీర్తన ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందింది. 

గజఈతగాళ్ళు ఆమె మృతదేహం కోసం కాలువలో గాలిస్తున్నప్పుడు నీళ్ళలో ఓ కారు కూడా ఉన్నట్లు గుర్తించడంతో పోలీసులు క్రేన్ రప్పించి దానిని బయటకు తీయగా, దానిలో మూడు మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో కనిపించాయి. కారు నెంబరు ఆధారంతో ఆ మూడు శవాలు గత 20 రోజులుగా కనిపించకుండాపోయిన ఎమ్మెల్యే మనోహర రెడ్డి బందువులవని పోలీసులు గుర్తించి ఆయనకు సమాచారం అందించారు. అనంతరం వారి మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఆయనకు అప్పగించారు.  

వారికారు కూడా ప్రమాదవశాత్తూ కెనాల్లోకి దూసుకుపోవడంతో వారు మరణించారా? లేక కుటుంబ కలహాలున్నట్లయితే సత్యనారాయణ రెడ్డి కావాలనే కారును కెనాల్లోకి నడిపించి ఆత్మహత్యలు చేసుకొన్నారా? లేక ఎవరైనా వారిని హత్య చేసి అనుమానం కలుగకుండా వారి శవాలను కారులో పడేసి కారును కెనాల్లో ముంచేశారా? అనే సందేహాలు తలెత్తడంతో పోలీసులు ఆ మూడు కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. 

అయితే తమ సోదరి కుటుంబంలో ఎటువంటి సమస్యలు, విభేధాలు లేవని అందరూ హాయిగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోలీసులకు తెలిపారు. కనుక ఇది ప్రమాదమా లేక ప్రమాదంలా కనిపిస్తున్న హత్యలా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 


Related Post