ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్ అమలు: కేటీఆర్‌

February 15, 2020


img

రాష్ట్రంలో పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ టౌన్ షిప్స్, అపార్టుమెంటులు మొదలు చిన్న చిన్న ఇళ్ళ నిర్మాణాలవరకు అవసరమైన అన్నిరకాల అనుమతులు వేగంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టిఎస్ బిపాస్ అనే సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నుంచి దానిని అమలుచేయబోతున్నట్లు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

కనుక మార్చినెలాఖరులోగా ఆ విధానం అమలుచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా మంత్రి కేటీఆర్‌ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ దానిలో ఏవైనా లోపాలున్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే అవసరమైన మార్పులు చేయిస్తానని తెలిపారు. ఈ నూతనవిధానంలో నేరుగా మునిసిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీసేవ లేదా టిఎస్ బీపాస్ లేదా దీనికోసం ప్రత్యకంగా రూపొందిస్తున్న మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని కేటీఆర్‌ తెలిపారు. ప్రజలకు వీలైనంత సులువుగా సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అది తమ బాధ్యత అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు కలిగి ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కనుక 75 గజాల లోపు నిర్మించే ఇళ్ళకు ఎటువంటి అనుమతులు తీసుకోవలసిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కనుక మునిసిపల్ అధికారులు, సిబ్బంది కూడా ప్రభుత్వ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Related Post