సూర్యాపేటలో టిఆర్ఎస్‌ నేత దారుణహత్య

February 15, 2020


img

సహకారసంఘాల ఎన్నికలు ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. సూర్యాపేట జిల్లాలో సూర్యపేట మండలం యార్కాపురం గ్రామంలో టిఆర్ఎస్‌ నేత, మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్ధి వర్గానికి చెందినవారు దారుణంగా హత్య చేశారు. 

శుక్రవారం సాయంత్రం ఆయన యార్కాపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా, కత్తులు, కర్రలతో వచ్చిన ప్రత్యర్ధులు ఆయనను వెంబడించారు. అప్పుడు ఆయన ప్రాణభయంతో గ్రామంలోని ఒకరి ఇంట్లో దాక్కోగా, ప్రత్యర్ధులు ఆయనను బయటకులాకొచ్చి కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. తీవ్ర రక్తస్రావంతో నేలపై పడున్న వెంకన్నతలపై బండరాయితో మోదడంతో ఘటనాస్థలంలోనే ఆయన చనిపోయారు. 

యార్కాపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నుంచే ఇరువర్గాల మద్య ఘర్షణలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. కానీ పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వలన ఈ దారుణం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. 

నేడు సహకార సంఘాల ఎన్నికలు జరుగనున్నందున గ్రామంలోని టిఆర్ఎస్‌ నేతలు సహకారసంఘంలో సభ్యులుగా ఉన్న కొందరు ఓటర్లను సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్బందించి ఉంచినట్లు ప్రత్యర్ధివర్గానికి తెలియడంతో వారు అక్కడకు చేరుకొని ఓటర్లను విడిపించుకు వెళ్ళేందుకు ప్రయత్నించినప్పుడు ఇరువర్గాల మద్య తీవ్ర ఘర్షణ జరిగింది. 

దాంతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ప్రత్యర్ది వర్గం శుక్రవారం సాయంత్రం యార్కాపురంలో కాపుకాసి వెంకన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. వెంకన్న హత్యతో యార్కాపురంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు సహకార సంఘాల ఎన్నికలు జరుగుతుండటంతో గ్రామంలో మళ్ళీ ఎటువంటి మళ్ళీ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్ రావు నేతృత్వంలో బారీగా పోలీసులను మోహరించారు.


Related Post