తెలంగాణ కాంగ్రెస్‌ దుకాణం మూతపడుతుంది: లక్ష్మణ్

February 14, 2020


img

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ప్రాంతీయపార్టీ ఆమ్ ఆద్మీ చేతిలో వరుసగా రెండవసారి కూడా ఓడిపోవడం విశేషమైతే, ఈ సందర్భంగా ఆ రెండు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్ళు చేసుకొంటుండటం మరో విశేషం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ఈనెల 16న ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన కేంద్రం వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలపై రాష్ట్ర బిజెపి  కె.లక్ష్మణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఏడు దశాబ్ధాలలో ఎస్సీ,ఎస్టీ, బలహీనవర్గాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ వారికి ఆన్యాయం జరుగుతోందంటూ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్‌ నిర్వాకం కారణంగా సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై తీర్పు చెపితే, దానికి కేంద్రప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. జగజ్జీవన్ రాంను ప్రధానమంత్రి కాకుండా అడ్డుకొన్నది మీ కాంగ్రెస్‌ పార్టీ కాదా? ఉత్తమ్‌కుమార్ రెడ్డి రిజర్వేషన్ల చరిత్ర తెలుసుకోకుండా, సామాజిక స్పృహలేకుండా మాట్లాడుతున్నారు. దళితులు, బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేసినది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు వారికోసం పోరాడుతామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. “కాంగ్రెస్‌ దుకాణాలు మూసుకొందామా?” అని కాంగ్రెస్‌ నేత శర్మిష్టా ముఖర్జీ చెప్పిన మాట తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. రాష్ట్రంలో తన ఉనికిని చాటుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి డ్రామాలు చేస్తోంది. కానీ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, దేశం నుంచి పూర్తిగా అదృశ్యం కావడం తధ్యం,” అని అన్నారు.


Related Post