మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ

January 25, 2020


img

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు మొదలైంది. తొమ్మిది మునిసిపల్ కార్పోరేషన్‌లలో 324 డివిజన్లు, 120 పురపాలక సంఘాలలో 3,029 వార్డులకు పోటీపడిన అభ్యర్ధుల భవిష్యత్‌ మరికొన్ని గంటలలో తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 2,619 టేబుళ్లు, 3,018 మంది సూపర్వైజర్లు, 5,876 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించింది. ఒక్కో టేబుల్ దగ్గర ముగ్గురు చొప్పున ఉంటారు. ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా కలక్టర్లు ఒక కౌంటింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారిని నియమిస్తారు. 

నిబందనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత మిగిలిన ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల సరళి స్పష్టమవుతుంది. ముందుగా తక్కువ వార్డులు కలిగిన పురపాలకసంఘాల ఫలితాలు వెలువడతాయి. మిగిలినవాటి ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటలోపు వెలువడవచ్చు. అయితే పోలింగ్ సరళిని బట్టి ఈ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధించబోతోందని తెలుస్తోంది.


Related Post