ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు

January 23, 2020


img

నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై 3టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుదవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తరువాత ఆయన ఓటర్లను ప్రభావితం చేసేవిదంగా తన ఫేస్‌బుక్‌లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌లోని ఒక ప్రార్ధనాస్థలం వద్ద గల ఆక్రమణలకు సంబందించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘన కిందే వస్తుందని ఎన్నికల అధికారులు చెపుతున్నారు. అయితే అధికారులు అభ్యంతరం చెప్పగానే వాటిని ఫేస్‌బుక్‌లో నుంచి తొలగించానని, అయినప్పటికీ అధికారపార్టీ ఒత్తిళ్ళ కారణంగా తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు.             

ప్రభుత్వాధికారులే ఎన్నికలలో విధులు నిర్వర్తిస్తుంటారు కనుక సహజంగానే వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారు లేకుంటే తరువాత సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందనే భయం వారిలో ఉంటుంది. అందుకే ప్రతిపక్షాల విషయంలో ఇంత నిఖచ్చిగా వ్యవహరించేవారు అధికారపార్టీ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తరువాత ఓటర్లను ప్రభావితం చేసే ఏపనులు చేయరాదని ఎన్నికల నిబందన. కానీ సరిగ్గా అప్పటి నుంచే ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ కార్యక్రమాలు జోరుగా సాగుతాయనేది ప్రజలందరికీ తెలుసు కానీ ఒక్క ఎన్నికల సంఘానికి మాత్రమే తెలియదు. అదే విచిత్రం. కనుక అసమదీయులకు...తసమదీయులకు ఎన్నికల కోడ్‌ ఒకేలాగ ఉండదు. 


Related Post