మేడారం జాతరకు నేడు అంకురార్పణం

January 22, 2020


img

ప్రతీ రెండేళ్ళకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5నుంచి 8 వరకు జరుగబోతోంది. దానికి నేడు అంకురార్పణ కార్యక్రమం జరుగబోతోంది. 

బుదవారం ఉదయం పూజారులు మేడారంలోని సమ్మక్క అమ్మవారి ఆలయంలో, కన్నెపల్లిలోని సారలమ్మవారి ఆలయాల తలుపులు తెరిచి ఆలయాలను కడిగి దీపాలు పెడతారు. మళ్ళీ రెండేళ్ళ తరువాత జరిగే జాతర వరకు ఈ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. 

ఆ తరువాత కాక వంశీయులు, సిద్దబోయిన వంశీయులు తెచ్చిన గడ్డితో ఆలయాల పైకప్పును అందంగా అలంకరిస్తారు. తరువాత ఆలయ పూజారులు ‘గుడిమెలిగె’ అనే ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించడంతో మహాజాతరకు అంకురార్పణం అవుతుంది. 

మొదటి బుదవారమైన నేడు గుడి మెలిగె, రెండవ బుదవారం (జనవరి 29)న మండ మెలిగె, మూడో బుదవారం (ఫిబ్రవరి 5)న మహాజాతర, నాలుగవ బుదవారం (ఫిబ్రవరి 12)న తిరుగువారం జరుగుతాయి కనుక మేడారం జాతరలో బుదవారం చాలా ప్రాముఖ్యమైన రోజుగా భావిస్తారు.    

ఫిబ్రవరి 5న సమ్మక్క, సారలమ్మ ఆలయాలను మరోసారి కడిగి శుభ్రపరిచిన తరువాత పూజారులు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరలు, సారెలు సమర్పిస్తారు. అదే రోజున మహబూబాబాద్ జిల్లా గంగారం మండలలోని పూనుగొండ్ల గ్రామం నుంచి పెనక వంశీయులు పగిడిద్దరాజును, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి నుంచి దబ్బగట్ల వంశీయుల అధ్వర్యంలో పోదెంబాబు గోవిందరాజుల స్వామివారిని తీసుకువచ్చి అమ్మవార్ల గద్దెలపై ప్రతిష్టిస్తారు.

ఆదేరోజు సాయంత్రం ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కన్నెపల్లి నుంచి కాక వంశీయులు సారలమ్మను జంపన్న వాగు మీదుగా మేడారంలోని గద్దెలవద్దకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దె మీద ప్రతిష్టించడంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదలవుతుంది. 

మరుసటిరోజు అంటే ఫిబ్రవరి 6 సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్టిస్తారు. 

ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం అమ్మవార్లు మళ్ళీ వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులు అమ్మవార్లకు, స్వామివార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకొంటారు. 

రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారని అంచనా. కనుక ఈ జాతరను దక్షిణ భారతదేశంలో మినీ కుంభమేళాగా పేరొందింది. ఈ జాతర కోసం ప్రభుత్వం చాలా భారీ ఏర్పాట్లు చేసింది. 


Related Post