మేడారం జాతరకు ఆదిలాబాద్ డిపో సిద్దం

January 21, 2020


img

ఫిబ్రవరి 5 నుంచి 8వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. వారి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ డిపోలు  ప్రత్యేక బస్సులను నడిపించడానికి సిద్దం అవుతున్నాయి. గిరిజనుల పండుగైన మేడారం జాతరకు గిరిజనులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏటా సుమారు 60-70, 000 మంది వెళుతుంటారు. కనుక ఈసారి వారికోసం ఆరు డిపోల నుంచి 304 ప్రత్యేక బస్సులను నడిపించాలని డిపో మేనేజర్లు నిర్ణయించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల మేనేజర్లు సోమవారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని డిపోలో సమావేశమయ్యి ఏర్పాట్ల గురించి చర్చించారు. గత ఏడాది సుమారు 68,000 మంది భక్తులు ఆర్టీసీ బస్సులలో మేడారం జాతరకు వెళ్ళివచ్చారు. కనుక ఈసారి 80,000 మందికి సరిపడా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 

జిల్లాలోని ఆరు డిపోలలో ఆసిఫాబాద్ డిపోకు చెందిన 65 బస్సులను మేడారం జాతరకు కేటాయించగా వాటిలో 10 బస్సులు ఆసిఫాబాద్ నుంచి, 55 బస్సులు బెల్లంపల్లి నుంచి బయలుదేరుతాయి. అదేవిధంగా బైంసా డిపోకు చెందిన 35 బస్సులు సిర్పూర్ నుంచి, నిర్మల్ డిపోకు చెందిన 52 బస్సులను మందమర్రి నుంచి బయలుదేరుతాయి. 


ఆదిలాబాద్ డిపోకు చెందిన 65 బస్సులను చెన్నూర్ నుంచి, మంచిర్యాల డిపో నుంచి 97 బస్సులను మేడారం జాతరకు నడిపించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. 

ప్రైవేట్ బస్సులు మేడారంకు సుమారు 2 కిమీ దూరంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ వరకు మాత్రమే వెళతాయి కానీ ఆర్టీసీ బస్సులన్నీ మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం వరకు వెళతాయి. మళ్ళీ అక్కడి నుండే తిరిగి బయలుదేరుతాయి కనుక అమ్మవార్ల దర్శనాలకు వెళ్ళేవారు ఆర్టీసీ బస్ సర్వీసులను వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ కోరారు.


Related Post