రేపే మునిసిపల్ పోలింగ్

January 21, 2020


img
అనేకసార్లు కోర్టు కేసులతో వాయిదాపడిన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు ఎట్టకేలకు రేపు అంటే బుదవారం జరుగనున్నాయి. వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చివరివరకు న్యాయపోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అయితే ఒక్క అధికార టిఆర్ఎస్‌ మాత్రమే అన్ని జిల్లాలో అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా, టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌ 2,616, బిజెపి 2,313 స్థానాలలోనే పోటీ చేస్తుండటం విశేషం. అవి పరిమిత స్థానాలలోనే పోటీ చేస్తున్నప్పటికీ మళ్ళీ వాటిలో ఎన్ని స్థానాలను అవి గెలుచుకొంటాయో ఎన్ని టిఆర్ఎస్‌కు కోల్పోతాయో ఈనెల 25న ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది. 

రేపు పోలింగ్ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 7,911 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. వాటిలో మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,586, మునిసిపాలిటీల పరిధిలో 6,325 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. 

రాష్ట్రంలో తొలిసారిగా కొంపల్లి మునిసిపాలిటీ పరిధిలోనే 10 వార్డులలోని పోలింగ్ బూత్‌లలో ప్రయోగాత్మకంగా ‘ఫేస్ రికగ్నీషన్’ (మొహాలను గుర్తించే విధానం) యాప్‌ను ఉపగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్‌లో అన్ని ఎన్నికలలో ఈ విధానాన్ని అమలుచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 

రేపు పోలింగ్‌లో పాల్గొనేందుకు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన శలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు మద్యం దుకాణాలు తెరువరాదని ఆదేశించింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుంది కనుక ఓటర్లు తప్ప వేరెవరూ పరిసర ప్రాంతాలలో సంచరించరాదని కోరింది. సోషల్ మీడియా, ఎస్ఎంఎస్, ప్రసార మాద్యమాల ద్వారా కానీ వ్యక్తిగతంగా గానీ ఎవరూ ప్రచారం చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. Related Post