ప్రొఫెసర్ కాసీంను ఎందుకు అరెస్ట్ చేశారు? హైకోర్టు

January 21, 2020


img

ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ చింతకింద కాసింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ శనివారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై శనివారం సాయంత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ ఎస్ చౌహాన్ నివాసంలో విచారణ చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కాసింను అరెస్ట్ చేసే ముందు పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌కు తెలియజేసి అనుమతి పొందారా? అని ప్రశ్నించారు. ఆయనపై 2016లో నమోదైన ఓ పోలీస్ కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొనడంపై జస్టిస్ ఆర్‌ ఎస్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రోజూ యూనివర్సిటీకి వచ్చి విద్యార్దులకు పాఠాలు చెపుతుంటే పరారీలో ఉన్నారని ఏవిధంగా చెపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారినప్పుడు వారి ఆరోపణలు నిజమా లేక చేతిలో అధికారం ఉంది కదాని ఇటువంటి కేసులతో ప్రజల గొంతులను నొక్కెందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అని తెలుసుకోవలసిన బాధ్యత న్యాయస్థానంపై ఉందన్నారు. న్యాయస్థానం ఆయన వాదనలను కూడా వినాలనుకొంటోందని కనుక ప్రొఫెసర్ కాసింను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. ఆయనపై 2016లో నమోదు అయిన కేసుకు సంబందించి కేస్‌ డైరీలు, ఎఫ్ఐఆర్ పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.


Related Post