గెలిపించే బాధ్యత ప్రజలది, పని చేసే బాధ్యత మాది: కేటీఆర్‌

January 18, 2020


img

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం సిరిసిల్లా పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వస్తే వారు రాష్ట్రానికి, జిల్లాకు ఏమి చేశారని గట్టిగా నిలదీసి అడగండి. నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అధనంగా నయాపైసా విదిలించలేదు. మరి మునిసిపల్ ఎన్నికలలో బిజెపిని గెలిపిస్తే వారు ఏవిధంగా కేంద్రం నుంచి నిధులు సాధించుకురాగలరు? దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలు పాలించాయి. కానీ ఏనాడైనా అవి తెలంగాణను, జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాయా? 

సరిగ్గా 5 ఏళ్ళ క్రితం అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపిస్తే సిరిసిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని మీకు హామీ ఇచ్చాను. నేను ఆ హామీ నెరవేర్చానో లేదో మీరే చెప్పాలి.  కాంగ్రెస్‌, బిజెపిలు ఏడు దశాబ్ధాలుగా చేయలేని పనులను టిఆర్ఎస్‌ ప్రభుత్వం కేవలం 4-5 ఏళ్ళలో సాధించి చూపిస్తోంది. కనుక పనిచేసే టిఆర్ఎస్‌క్‌ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలి. 

గాడిదకు గడ్డి వేసి ఆవు దగ్గర పాలు పిండితే ప్రయోజనం ఉండదు. అదేవిధంగా టిఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌, బిజెపిలకు ఓట్లు వేసినా ప్రయోజనం ఉండదు. నాకు సిరిసిల్లా రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం.  మీ అందరి ఆశీర్వాదాలతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. కనుక మీ అందరి రుణం తీర్చుకొనేందుకు సిరిసిల్లాను దేశంలోనే నెంబర్: 1 పట్టణంగా తీర్చిదిద్దుతానని మీకు హామీ ఇస్తున్నాను. మమ్మల్ని గెలిపించే బాధ్యత మీది. పనిచేసే బాధ్యత మాది. ఒకవేళ గెలిచినవారెవరైనా సరిగ్గా పనిచేయకపోతే వారిని పదవులలో నుంచి తొలగించేవిధంగా చట్టాన్ని రూపొందించాము. కనుక పనిచేసేపార్టీ టిఆర్ఎస్‌నే గెలిపించవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.


Related Post