కాంగ్రెస్‌, బిజెపిలకు కేటీఆర్‌ సూటి ప్రశ్న

January 18, 2020


img

మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలైన టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిల మద్య జోరుగా విమర్శలు..ప్రతివిమర్శలు, సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. బిజెపిని చూసి టిఆర్ఎస్‌ భయపడుతోందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేయడంతో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఘాటుగా స్పందించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీపై, ప్రభుత్వంపై బురదజల్లుతున్న కాంగ్రెస్‌, బిజెపిలకు మునిసిపల్ ఎన్నికలలో ప్రజలే తగినవిధంగా బుద్ది చెపుతారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న ఆ రెండు పార్టీలు దేశం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఏమి చేయనందున ఈ ఎన్నికలలో ప్రజలే వాటికి ఛార్జ్ షీట్ ఇవ్వబోతున్నారు. మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ఆ రెండు పార్టీలకు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు నిజంగా అంత సత్తా ఉన్నట్లయితే మరి రాష్ట్రంలో అన్ని వార్డులలో మీ అభ్యర్ధులను ఎందుకు నిలుపలేకపోయారు? సమాధానం చెప్పాలి.

మునిసిపల్ ఎన్నికలలో గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తామని హామీ ఇస్తున్న కె.లక్ష్మణ్‌ గత ఆరేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పగలరా? అప్పుడు తేలేనప్పుడు ఇప్పుడు మాత్రం ఏవిధంగా తేగలరు? టిఆర్ఎస్‌ అభ్యర్ధులను ఓడించేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ మా తిరుగుబాటు అభ్యర్ధులకు తెర వెనుక సహాయసహకారాలు అందిస్తున్న సంగతి మాకు తెలుసు. కానీ మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్‌, బిజెపిలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేవలం టిఆర్ఎస్‌ అభ్యర్ధులనే గెలిపిస్తారని తెలుసుకొంటే మంచిది,” అని అన్నారు. 


Related Post