బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా

January 14, 2020


img

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర హోంమంత్రి  అమిత్ షా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జెపి నడ్డా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అమిత్ షాకు కీలకమైన హోంమంత్రి పదవిని నిర్వర్తిస్తూ మరోపక్క పార్టీ వ్యవహారాలు చూసుకోవడం కష్టంగా ఉంటున్నందున ఆయన పార్టీ పగ్గాలు జెపి నడ్డాకు అప్పజెప్పబోతున్నారు. అయితే పార్టీ నిబందనల ప్రకారం ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది కనుక త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. కానీ జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనప్రాయమే కనుక వచ్చే వారంలో జెపి నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ వెల్లడించింది. దీనిపై జనవరి 20వ తేదీన బీజేపీ అధికారిక ప్రకటన చేస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ కలిసి దేశంలో పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, అనేక సాహసోపేతమైన నిర్ణయాలను అమలుచేస్తున్నారు. దాంతో వారిది గొప్ప రాజకీయ జోడీగా పేరొందింది. త్వరలోనే డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో గెలిచేందుకు బీజేపీ చిరకాలంగా ప్రయత్నిస్తోంది. కనుక డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని గెలిపించడమే జెపి నడ్డాకు తొలి పరీక్షగా చెప్పవచ్చు. మరి ఆ పరీక్షలో జెపి నడ్డా నెగ్గుతారో లేదో చూడాలి.


Related Post