సిబిఐ కోర్టుకు హాజరైన ఏపీ సిఎం జగన్‌

January 11, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరూ అక్రమాస్తుల కేసులో శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన మేరకు తెలంగాణ పోలీసులు సిబిఐ కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టులోకి వారిరువురినీ, ఇరుపక్షాల న్యాయవాదులను తప్ప మరెవరినీ అనుమతించలేదు. 

జగన్, విజయసాయిలపై దాఖలైన 11 చార్జిషీట్లలో రెండింటిపై హైకోర్టు స్టే విధించడంతో మిగిలిన వాటిపై విచారణ జరుగుతోంది. అయితే తామిరువురం ఎటువంటి నేరం చేయలేదని కనుక తమను ఈ కేసుల నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ వారిరువురూ వేసుకొన్న డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని చేసిన అభ్యర్ధనపై ఈడీ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. జగన్ హోదా మారినప్పటికీ జరిగిన నేర స్వభావం మారలేదు కనుక తప్పనిసరిగా కోర్టుకు హాజరవ్వాలని వాదించారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిసినందున తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణకు వారిరువురూ తప్పనిసరిగా హాజరు కావాలని సిబిఐ కోర్టు చెప్పలేదు కనుక వారిరువురూ మళ్ళీ ఆబ్సెంట్ పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.


Related Post