తెలంగాణకు పాకిన క్యాబ్ ఆందోళనలు

December 14, 2019


img

పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్)ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఉదృతంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు క్యాబ్ ఆందోళనలు తెలంగాణ రాష్ట్రానికి కూడా పాకాయి. రాష్ట్రంలో పలు జిల్లాలలో ముస్లింలు శుక్రవారం మసీదులలో ప్రార్ధనలు ముగించుకొన్న తరువాత ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. కొన్ని జిల్లాలలో ర్యాలీలు నిర్వహించి జిల్లా కలెక్టర్, తహసిల్ధారులకు వినతి పత్రాలు సమర్పించారు. 

రాజధాని హైదరాబాద్‌ నగరంలో కూడా పలుచోట్ల క్యాబ్‌ను వ్యతిరేకిస్తూ ముస్లింలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో దారుల్ షిఫా, సైదాబాద్, మోహిదీపట్నం, అంబర్ పేట, చాంద్రాయణ గుట్ట, టోలీ చౌక్, దబీరు పురా, మారేడుపల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, బోయినపల్లి తదితర ప్రాంతాలలో ముస్లింలు క్యాబ్‌కు వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించారు. జమైత్-ఉలేమా-ఏ-హింద్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, మజ్లీస్ బచావ్ తెహ్రీక్, వాహ్దత్-ఏ-ఇస్లామీ తదితర సంఘాల ఆధ్వర్యంలో ముస్లింలు నిరసనలు తెలియజేశారు. 

ఈ చట్టంతో దేశప్రజలను మతపరంగా విడదీయాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ  చట్టాన్ని కేంద్రప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని లేకుంటే ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.


Related Post