ఆర్టీసీకి స్వర్ణయుగం ప్రారంభం అయ్యింది: మంత్రి పువ్వాడ

December 14, 2019


img

సిఎం కేసీఆర్‌ స్వయంగా టీఎస్‌ఆర్టీసీని పర్యవేక్షించాలని నిర్ణయించడంతో ఆర్టీసీకి స్వర్ణయుగం ప్రారంభం అయ్యిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని అతి త్వరలోనే లాభాలబాటలోకి పరుగులు పెట్టిస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు మళ్ళీ విధులలో చేరడంతో తాను కూడా ఇప్పుడు ఆర్టీసీ సమస్యలపై దృష్టి పెడుతున్నానని చెప్పారు. 

ఆర్టీసీ ఛార్జీలు కిమీకు 20 పైసలు చొప్పున పెంచడం ద్వారా ఇప్పుడు లాభం, నష్టం లేకుండా సరిసమాన ఆదాయంతో నడుస్తోందని చెప్పారు. సమ్మె కారణంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులకు ఆదరణ తగ్గిందన్నారు. కనుక హైదరాబాద్‌ నగరంలో కొన్ని రూట్లలో దశలవారీగా 700-800 బస్సులు తగ్గించబోతున్నట్లు మంత్రి చెప్పారు. బస్సులు తగ్గించినా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని మంత్రి చెప్పారు. 

ఆ బస్సులలో సీట్లను తొలగించి కొన్నిటినీ మహిళా కార్మికులకు డ్రెస్స్ ఛేంజ్ రూమ్, టాయిలెట్లుగా మార్చుతామని మిగిలినవాటిని సరుకు రవాణాకు అనుకూలంగా మార్చి గిడ్డంగుల నుంచి సరుకులను రేషన్ షాపులకు చేర్చేందుకు, గ్రామాల నుంచి కూరగాయలను హైదరాబాద్‌, జిల్లా కేంద్రాలకు చేర్చేందుకు వినియోగించుకొంటామని మంత్రి తెలిపారు. అలాగే పార్సిల్ సర్వీసులను మరింత పెంచుతామని సరుకు రవాణా ద్వారా ఏడాదికి రూ.300-400 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. 

ప్రజల ముంగిటకే బస్సులు అనే విధానంతో ప్రవేశపెట్టిన వజ్ర బస్సులకు ప్రజాధారణ లభించలేదు కనుక వాటిని మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేయబోతునట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులలో స్లీపర్ బెర్తులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

యూనియన్ నేతల చెప్పుడు మాటలు నమ్మి సమ్మె చేసి అష్టకష్టాలు పడిన ఆర్టీసీ కార్మికులు ఇక ఆర్టీసీలో యూనియన్లే వద్దని కోరుకొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా తమ బాగోగులు చూసుకొంటానని హామీ ఇచ్చినందున ఆర్టీసీలో యూనియన్లు వద్దని కోరుతూ 40,000 మంది కార్మికులు సంతకాలు చేసి ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆర్టీసీలో యూనియన్లు లేనప్పటికీ ఆర్టీసీ కార్మికుల సంక్షేమ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా ఉదయం ఫిర్యాదు చేస్తే సాయంత్రానికల్లా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి వీలైతే సమస్యలు పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకొంటున్నామని మంత్రి పువ్వాడ తెలిపారు. 

ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సిఎం కేసీఆర్‌ వద్ద చాలా గొప్ప ప్రణాళిక ఉందని దానిని అమలుచేసి ఆర్టీసీకి మళ్ళీ పూర్వవైభవం సాధిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 


Related Post