రాజ్యసభలో నేడు నెంబర్ గేమ్!

December 11, 2019


img

మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ చట్టసవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో బుదవారం మధ్యాహ్నం దానిని రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉన్నందున ఎటువంటి బిల్లునైనా అవలీలగా ఆమోదింపజేసుకోగలదు. కానీ రాజ్యసభలో బిజెపికి 83 మంది, ఎన్డీయేలో మిత్రపక్షాలకు 25మంది కలిపి మొత్తం 108 మంది ఎంపీలున్నారు. రాజ్యసభలో మొత్తం 240 స్థానాలు ఉన్నందున ఈ బిల్లుకు ఆమోదముద్ర పడాలంటే కనీసం 121 మంది ఎంపీల మద్దతు అవసరం. అంటే మరో 13మంది ఎంపీల మద్దతు అవసరమన్న మాట. ఈ బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపిన వైసీపీ, టిడిపి, బిజెడి, శివసేనలు రాజ్యసభలో కూడా మద్దతు తెలుపడం ఖాయమనే భావించవచ్చు. వాటన్నిటికీ కలిపి 14 మంది ఎంపీలున్నారు. వారేగాక నలుగురు స్వతంత్ర ఎంపీలు, ముగ్గురు నామినేటడ్ ఎంపీలు కూడా ఈ బిల్లుకు మద్దతు పలికే అవకాశాలున్నాయి. కనుక దీనిని రాజ్యసభలో అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



Related Post