జనవరి 1నుంచి నాంపల్లిలో ఎగ్జిబిషన్‌ షురూ

December 10, 2019


img

ఏటా నాంపల్లిలో జరిగే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాకు తెలియజేశారు. గత ఏడాది ఎగ్జిబిషన్‌లో జరిగిన బారీ అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈసారి అగ్నిమాపకశాఖ సూచనల ప్రకారమే ఎగ్జిబిషన్‌ స్టాల్స్ నిర్మిస్తున్నామని, అగ్నిప్రమాదాలు జరుగకుండా అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నామని తెలిపారు. 

గత 78 సం.లుగా ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నా ఏనాడూ అగ్నిప్రమాదం జరుగలేదని కానీ మొట్టమొదటిసారిగా గత ఏడాది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరగడం, దానిలో కోట్లు విలువచేస్తే వస్తువులు దగ్ధం అవడం తమకు చాలా బాధ కలిగించాయని ఈటల రాజేందర్‌ అన్నారు. కనుక ఈసారి అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎగ్జిబిషన్‌ మైదానంలో విద్యుత్ వైర్లు ఎక్కడా పైకి కనబడకుండా అండర్ గ్రౌండ్‌ డక్ట్స్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారస్తులకు ఎగ్జిబిషన్‌లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎగ్జిబిషన్‌ చూసేందుకు రోజు లక్షలాదిమంది ప్రజలు వస్తుంటారు కనుక ఈసారి వారి భద్రతకు మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహణ ద్వారా వచ్చే సొమ్మును రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. 



Related Post