అమిత్ షాపై నిషేదం విధించాలి: యూఎస్‌ సీఐఆర్‌ఎఫ్‌

December 10, 2019


img

ఎన్డీయే ప్రభుత్వం ప్రతిషష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు ఇంకా రాజ్యసభ ఆమోదం పొందక మునుపే విదేశాలలో సైతం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విశేషం. 

అమెరికాకు చెందిన యూఎస్ కమీషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, “భారత రాజ్యాంగానికి విరుద్దంగా ఉన్న ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కలిగే ప్రమాదం కనబడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద లౌకికవాద దేశంగా పేరున్న భారత్‌ ఈ బిల్లుతో దేశంలో మతపరంగా ప్రజల విభజనకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ బిల్లుతో భారత్‌ ప్రభుత్వం తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నట్లవుతుంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే దీనిని ప్రతిపాదించిన భారత్‌ హోంమంత్రి అమిత్ షా తదితరులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు. 

ఈ బిల్లులో మంచి చెడుల విషయం కాసేపు పక్కన పెడితే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధిస్తూ ఒక బిల్లును తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ట్రంప్ దృష్టిలో ప్రపంచంలో ముస్లింలు అందరూ తీవ్రవాదులే కనుక. మతం ప్రాతిపదికన ట్రంప్ సర్కార్ ముస్లిం ప్రజలపై విదించిన ఈ నిషేధం గురించి నోరెత్తి మాట్లాడని ‘యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌’ భారత పార్లమెంటు ఆమోదముద్రవేయక మునుపే పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది.


Related Post