పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

December 10, 2019


img

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దీనిపై లోక్‌సభలో వాడివేడిగా చర్చలు సాగాయి. అసలు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలా వద్దా అనే దానిపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 293, వ్యతిరేకంగా 80 మంది ఓటేయడంతో బిల్లుపై చర్చ ప్రారంభం అయ్యింది. ఆ తరువాత దానిలో అంశాలవారీగా సభలో లోతుగా చర్చ జరిగినప్పుడు, ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి సభ్యులకు వివరించారు. ఈ బిల్లుపై సోమవారం అర్ధరాత్రి వరకు లోక్‌సభలో చర్చించిన తరువాత ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. దాంతో పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర పడింది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దానిపై లోక్‌సభలో జరిగిన చర్చలో తన ప్రసంగం ముగిస్తూ బిల్లు ప్రతిని చించివేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  

ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీలలో టిడిపి, వైసీపీ, బిజెడీ (ఒడిశా), శివసేన (మహారాష్ట్ర), అకాలీదళ్ (పంజాబ్) పార్టీలు మద్దతు తెలుపగా, తెరాస, మజ్లీస్, కాంగ్రెస్‌ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. బిజెపికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉంది కనుక ఎటువంటి బిల్లులనైనా ఆమోదింపజేసుకోగలదు కానీ రాజ్యసభలో తగినంత బలం లేనందున ప్రతిపక్షాలలో అనుకూలంగా ఉండే పార్టీల మద్దతు కూడగట్టుకోవలసి ఉంటుంది.


Related Post