కేసీఆర్‌ దమ్మున్నోడు..అందుకే... జగన్

December 09, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శాసనసభ సాక్షిగా తెలంగాణ సిఎం కేసీఆర్‌కు హ్యాట్స్ ఆఫ్ అంటూ జేజేలు పలికారు. దిశ కేసులో దోషులను 10 రోజులలోపే శిక్షించి భాదితురాలికి, ఆమె కుటుంబానికి సిఎం కేసీఆర్‌ న్యాయం చేశారని జగన్ అభినందించారు. కేసీఆర్‌ దమ్మున్నోడు కనుకనే ఇంత ధైర్యంగా, వేగంగా దోషులను శిక్షించారని జగన్ మెచ్చుకొన్నారు. సినిమాలలో హీరో విలన్లను ఎన్‌కౌంటర్‌ చేస్తే జనాలు చప్పట్లు కొడుతూ మెచ్చుకొంటారని ఆ సినిమాలు హిట్ అవుతుంటాయని, అదే నిజజీవితంలో దోషులను శిక్షించగానే డిల్లీ నుంచి మానవ హక్కుల కమీషన్ సభ్యులు పరిగెత్తుకొంటూ వచ్చేసి ఎన్‌కౌంటర్‌ ఎందుకు చేశారు? ఎలా చేశారు? అంటూ ప్రశ్నిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లోపభూయిష్టమైన చట్టాల కారణంగానే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని జగన్ అన్నారు. ఎన్‌కౌంటర్లను సమర్ధించలేము కనుక వీలైనంత త్వరగా నేరస్తులకు కటినమైన శిక్షలు పడేవిధంగా తమ ప్రభుత్వం బుదవారం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టబోతోందని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 

అత్యాచార ఘటనలపై పోలీసులు వారం రోజులలోపు దర్యాప్తు పూర్తిచేసి, సాక్ష్యాధారాలు, డీఎన్ఏ రిపోర్టు వగైరాఅన్ని సిద్దం చేసుకోవాలి. మూడు వారాలలోపు కోర్టు విచారణ పూర్తికావాలి. ఆ తరువాత మూడు రోజులలోపు నేరస్తులకు ఉరి శిక్షలు అమలుచేయాలి. అప్పుడే ఇటువంటి నేరాలు చేయాలంటే నేరస్తులకు భయం పుడుతుంది. కనుక ఈవిధంగా చేయడం కోసం బుదవారం శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టబోతున్నాము,” అని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. 

శాసనసభ చట్టాలను చేయగలదు కానీ రాజ్యాంగాన్ని.. దానిలో పేర్కొన్న నియమనిబందనలను మార్చలేదనే సంగతి బహుశః ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిసినట్లు లేదు. మూడు వారాలలో నేరవిచారణ పూర్తి చేసి అత్యాచార నేరస్తులకు ఉరిశిక్షలు విధించడం సాధ్యం కాదు. ఎందుకంటే, ఫాస్ట్-ట్రాక్ కోర్టు దోషులను నిర్దారించి ఉరి శిక్ష వేసినప్పటికీ, మన చట్టాల ప్రకారం నేరస్తులకు పైకోర్టులో అప్పీలు చేసుకొనే హక్కు ఉంటుంది. మరణశిక్ష పడిన నేరస్థులైనా సరే హైకోర్టుకు, ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు కలిగి ఉంటారు. ఆ హక్కును రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా రద్దు చేయలేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే మానవ హక్కుల సంఘాలు, హైకోర్టు, సుప్రీంకోర్టులే మొదట అడ్డుకొంటాయి. కనుక ఇటువంటి వ్యవహారాలపై శాసనసభలో ఆవేశంగా మాట్లాడితే సొంత పార్టీ సభ్యులు, సామాన్య ప్రజలు చప్పట్లు కొట్టవచ్చు కానీ న్యాయస్థానాలు అంగీకరించవు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు శాసనసభలో చేసిన ప్రకటనపై రేపటి నుంచి మీడియాలో జరుగబోయే చర్చలను చూస్తే ఆవిషయం అర్ధం అవుతుంది. కనుక ఇటువంటి చట్టసంబందమైన విషయాల గురించి ముందుగా న్యాయనిపుణులు, పార్టీలో సీనియర్ నేతలను సంప్రదించిన తరువాత అడుగు ముందుకు వేస్తే మంచిది. 


Related Post