త్వరలో సిఎం కేసీఆర్‌ మళ్ళీ డిల్లీ పర్యటన?

December 09, 2019


img

ఇటీవల సిఎం కేసీఆర్‌ డిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్రమోడీని కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలనుకొన్నారు. కానీ ప్రధాని మోడీ పార్లమెంటు సమావేశాలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున సిఎం కేసీఆర్‌కు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. దాంతో ప్రధానిని కలవకుండానే సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లభిస్తే మళ్ళీ ఈనెల 12, 13 తేదీలలో డిల్లీ వెళ్లాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 

ఆర్ధికమాంద్యం కారణంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. బహుశః ఆ కారణంగానే జిఎస్టీలో రాష్ట్రాల వాటాలను చెల్లించడంలో చాలా జాప్యం అవుతోంది. జిఎస్టీ నిధుల కోసం మాటిమాటికి డిల్లీ రావడం, కేంద్రమంత్రులు, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని, కనుక ఎప్పటికప్పుడు జిఎస్టీ రాష్ట్రాల వాటాలను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. బహుశః సిఎం కేసీఆర్‌ కూడా అదే పనిపై మళ్ళీ డిల్లీ వెళుతున్నారనుకోవచ్చు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లభిస్తే దీనితో పాటు రాష్ట్రానికి సంబందించిన ఇతర అంశాలపై కూడా చర్చించవచ్చు.


Related Post